జిఎస్‌టి శ్లాబుల మార్పు అంశాన్ని బలమైన రాజకీయ అస్త్రంగా మల్చుకొనేందుకు బిజెపి సిద్ధమవుతోంది. ఇప్పటికే అమలులోనున్న జిఎస్‌టి విధానంతో ప్రధాని నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ శక్తులకే మేలు చేశారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ వచ్చారు. వాటిని ఎదుర్కొనేందుకు తాజాగా జిఎస్‌టి శ్లాబుల మార్పుతో తాము పేద, సామాన్య, మధ్య తరగతి పక్షమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంతగా మిడిల్ క్లాస్‌కు ప్రధాని మేలు చేశారని బిజెపి అంటోంది. మోడీ వల్లనే ఈ రోజున మధ్యతరగతి పేదవర్గాలు అనూహ్యంగా లబ్ధి పొందుతున్నాయని జనంలోకి వెళ్లి గట్టిగా చెప్పుకొనేందుకు బిజెపి ప్రయత్నలు సాగిస్తోంది. వాస్తవానికి జిఎస్‌టి శ్లాబుల వల్ల సామాన్య, మధ్యతరగతికి ఊరట లభిస్తున్నది. కానీ మోడీ సర్కార్ ఈవర్గాలకు దీపావళి, దసరా కానుక ఇచ్చింది అనడం ఎంతవరకు సమంజసమన్నది ఆలోచించాలి.
అదేసందర్భంలో జిఎస్‌టి శ్లాబుల మార్పు కారణంగా 12%, 28% శ్లాబులను ఎత్తివేసి కేవలం 5%, 18% శ్లాబులు మాత్రమే కొనసాగించనున్నారని, వీటి వల్ల కేంద్రం రూ. 48,000 కోట్ల ఆదాయం కోల్పోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ వెల్లడించారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతన్నలు ఉద్యమమే నడిపితే గానీ వాటి రద్దుకు దిగిరాని మోడీ సర్కార్ ఎవరూ కోరకుండానే జిఎస్‌టి శ్లాబులను మార్చి పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేందుకు సిద్ధ్దమైందంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. అందుకే మోడీ సర్కార్ అమలు చేయనున్న జిఎస్‌టి శ్లాబుల మార్పు నిర్ణయం వెనుకఉన్న మర్మమేమిటీ అన్నది ఇక్కడ ఆలోచన చేయాలి. ఈ జిఎస్‌టి శ్లాబుల మార్పు వల్ల ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులు చాలా వరకు జీరో శాతం జిఎస్‌టి లేదా 5% జిఎస్‌టి పరిధిలోకి రానున్నాయన్నది అందరికీ తెలిసిందే. ఇప్పటికే అమలులోనున్న జిఎస్‌టి విధానంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశనంటాయన్నది కూడా వాస్తవం. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశనంటినా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల నెలసరి సంపాదనలో మాత్రం ఆ మేర పెరుగుదల కనిపించలేదు. అంటే అరకొర ఆదాయంతో ఈ వర్గాల కొనుగోలుశక్తి తగ్గింది. పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాలు నిత్యావసర వస్తువుల కొనుగోలుకోసం తీర్చగలిగినంత మేరకే అప్పులు చేస్తారు.
తాహత్తుకు మించి అప్పులు చేయరు. అవసరమైతే సర్దుబాటు ధోరణీని అవలంబిస్తారు. అంటే నిత్యావసర వస్తువులలో కూడా కచ్చితంగా అవసరమైన వాటినే కొనుగోలు చేస్తారు. అది కూడా తమ ఆదాయం మేర వాటికి అనుగుణమైన పరిమితిలో కొనుగోలు చేస్తారు. ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజల స్వభావం. అంటే ఎక్కువు మోతాదులో జిఎస్‌టిని నిత్యావసర వస్తువుల మీద విధిస్తే వాటి కొనుగోలు కూడా తగ్గుతుంది. అంటే ప్రజల కొనుగోలుశక్తి తగ్గితే వ్యాపార లావాదేవీలపై వాటి ప్రభావంపడి కేంద్రానికి జిఎస్‌టి రూపంలో వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. అంటే మోడీ సర్కార్ ఇప్పటికే అమలు చేస్తున్న జిఎస్‌టి విధానంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల కొనుగోలుశక్తి తగ్గి ఆ మేర జిఎస్‌టి రూపంలో కేంద్రానికి వచ్చే ఆదాయం కూడా తగ్గి వుండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ జిఎస్‌టి ఆదాయం తగ్గివుంటే అది మోడీ సర్కార్‌కు నష్టం వచ్చేంతగా కాదని గుర్తించాలి. సామాన్య, మధ్యతరగతి వర్గాల నుంచి అధిక పన్నుతో పీడించి వసూలు చేయాలనుకొనే ఆదాయ అంచనాల్లో కాస్త తగ్గుదల కనిపించవచ్చు. అదే జిఎస్‌టి పన్ను తగ్గిస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి సామాన్య, మధ్యతరగతి వర్గాల కొనుగోలుశక్తి పెరిగి పన్ను రూపంలో కేంద్రానికి వచ్చే ఆదాయం పెరిగే అవకాశముంటుంది.
ఇదే లాజిక్ ను ఇపుడు మోడీ సర్కార్ జిఎస్‌టి శ్లాబుుల సవరణలో ప్రదర్శించింది. మరోవైపు ఈ జిఎస్‌టి సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రస్తుతం భారతదేశ జిఎస్‌టి సుమారు రూ. 330 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో వినియోగం వాటా రూ. 202 లక్షల కోట్లు. జిఎస్‌టి రేట్లు తగ్గడం వల్ల ధరలు తగ్గి, ప్రజలు ఎక్కువ వస్తువులు కొనుగోలు చేస్తారు. జిఎస్‌టి తగ్గింపు వల్ల ప్రజల వినియోగం కనీసం 10 శాతం పెరిగినా, దేశ ఆర్థిక వ్యవస్థకు అదనంగా రూ. 20 లక్షల కోట్లు జత అవుతుందని అంచనా వేశారు. వాస్తవానికి జిఎస్‌టి శ్లాబుల మార్పుతో కేంద్రానికి రూ.48,000 కోట్ల నష్టం తాత్కాలికంగా జరిగినా, ధరల తగ్గుదలతో ప్రజలు కొనుగోలుశక్తి పెరిగితే ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ. 20 లక్షల కోట్లు జత అవుతుందన్నది మోడీ సర్కార్ లెక్క. దీనిని బట్టి చూస్తే మోడీ సర్కార్ ఈ జిఎస్‌టి శ్లాబుల మార్పుతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు దసరా, దీపావళి కానుక ఇచ్చిందా లేక తాను ఈ కానుక పొందుతుందా అన్నది ఇక్కడ స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది చూస్తే తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. ఇక 2027లో ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. వీటిలో పాటు మరికొన్ని కీలక రాష్ట్రాలున్నాయి.
వివిధ రాష్ట్రాల ఎన్నికలు ముందుంటే మరోవైపు ఇండియా కూటమి తరఫున ప్రారంభమైన ఓట్ చోర్ గద్ది ఛోడ్ ఉద్యమం మరోవైపు బిజెపికి పెనుసవాళ్లు విసురుతోంది. దీంతో తాజాగా కేంద్రంలోని మోడీ సర్కార్ జిఎస్‌టిలో మార్పులు తీసుకొచ్చి తమది సామాన్యుడి, మధ్యతరగతి ప్రభుత్వమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. దాదాపు పదకొండేళ్ల మోడీ పాలనలో జిఎస్‌టి నిర్ణయాలతో పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు నష్టపోయింది ఎంతో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రజల కడుపు మాడ్చి ఎన్నికలకు ముందు బిర్యాన్నీ ఫ్రీ అని ప్రకటించి పబ్బం గడుపుకోవడం రాజకీయ పార్టీల నైజం. ఈ విషయంలో బిజెపి అన్ని పార్టీల కంటే పదిఆకులు ఎక్కువే చదివింది. ఈ కోవలోనిదే తాజాగా చేసిన జిఎస్‌టి శ్లాబు మార్పుల నిర్ణయం. ఓట్ చోర్ గద్దీ ఛోడ్ ఉద్యమంనుంచి ప్రజల దృష్టిన మళ్ళీంచడం, జిఎస్‌టి తగ్గింపుతో సామాన్య, మధ్యతరగతికి పెద్ద ఎత్తున్న మేలు చేశామని చెప్పుకోవడం, మరోవైపు ప్రజలు కొనుగోలుశక్తిని పెంచి తన ఖజానాకు ఆదాయం పెంచుకోవడం వంటి లాజిక్ నిర్ణయమే ఈ జిఎస్‌టి శ్లాబుల మార్పు అంశాన్ని చూడాలి.
సయ్యద్ నిసార్ అహ్మద్
78010 19343