గోల్కొండ నుంచి టూంబ్స్ వరకు సుమారుగా 1.5 కిలోమీటర్ల మేర రోప్ వే (స్కైవే కేబుల్‌కార్‌ను) వేయడానికి హెచ్‌ఎండిఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు హైదరాబాద్ పరిధిలో పాదాచారుల కోసం రెండుచోట్ల స్కైవాక్‌లను నిర్మించాలని హెచ్‌ఎండిఏ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి కన్సల్టెన్సీ కోసం హెచ్‌ఎండిఏ టెండర్‌లను పిలిచింది. గోల్కొండను చూడడానికి వచ్చే సందర్శకులు టూంబ్స్ వరకు సుమారుగా 1.5 కిలోమీటర్ల మేర వెళ్లాలంటే రహదారి చిన్నగా ఉండడం, వాహనాలతో ట్రాఫిక్ జాం కావడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ ఇబ్బందులను అధిగమించడానికి రోప్‌వే వేస్తే పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తవని హెచ్‌ఎండిఏ భావిస్తోంది.
అందులో భాగంగా రోప్‌వే వేయడానికి సాధ్యాసాధ్యాలను హెచ్‌ఎండిఏ పరిశీలిస్తోంది. అయితే, రోప్‌వే కోసం ఎంపికయ్యే కన్సల్టెన్సీ గోల్కొండ టు టూంబ్స్‌ల మధ్య ఉన్న రక్షణశాఖ స్థలాలకు ఇబ్బంది కాకుండా వారితో సమన్వయం చేసుకునేలా వ్యవహారించడంతో పాటు దానికి అయ్యే ఖర్చు, తదితర అంశాల గురించి హెచ్‌ఎండిఏకు నివేదిక అందచేయనుంది. ఒకవేళ కన్సల్టెన్సీ అధ్యయనం తరువాత నివేదిక అందచేస్తే త్వరలోనే ఈ రోప్‌వే నిర్మాణం పట్టాలెక్కనుంది. 2026లో ఈ రోప్‌వే నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
కూకట్‌పల్లి జేఎన్‌టియూ నుంచి లూల్లూ మాల్, జేఎన్‌టియూ మెట్రో వరకు
కూకట్‌పల్లి జేఎన్‌టియూ నుంచి లూల్లూ మాల్, జేఎన్‌టియూ మెట్రోవరకు స్కైవాక్‌ను నిర్మించాలని హెచ్‌ఎండిఏ భావిస్తోంది. అందులో భాగంగా దీనికి సంబంధించి సర్వే నిర్వహిస్తోంది. ఉప్పల్ జంక్షన్‌లో నిర్మించిన స్కైవాక్ మాదిరిగానే ఇక్కడ నిర్మాణం జరపాలని హెచ్‌ఎండిఏ భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నిర్మాణానికి సంబంధించి కావాల్సిన స్థల సేకరణ గురించి స్థానిక రెవెన్యూ అధికారులతో చర్చించినట్టుగా తెలిసింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్ వరకు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ వరకు మరో స్కైవాక్‌ను నిర్మించాలని హెచ్‌ఎండిఏ కసరత్తు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే కన్సల్టెన్సీను సైతం ఎంపిక చేసినట్టుగా తెలిసింది. రైల్వేస్టేషన్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులతో రోడ్లు ట్రాఫిక్ జాంలు కాకుండా హెచ్‌ఎండిఏ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మెట్రో ఎక్కాల్సిన ప్రయాణికులు, మెట్రో స్టేషన్‌కు వెళ్లేలా, బస్టాప్‌లకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్‌లకు వెళ్లేలా ఈ స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నట్టు హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు.
Also Read: ఎంజిబిఎస్ మెట్రో స్టేషన్, రాయదుర్గంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు