దులీప్ ట్రోఫీ 2025 విజేత సెంట్రల్ జోన్

బెంగళూరు: ప్రతిష్టాత్మకమైన దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ విజేతగా నిలిచింది. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్లో సెంట్రల్ ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సౌత్ జోన్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో సెంట్రల్ ఈ మాత్రం స్కోరును అందుకోవడానికి కూడా తీవ్రం శ్రమించాల్సి వచ్చింది. గుర్జాప్‌నీత్ సింగ్, అంకిత్ శర్మలు అద్భుత బౌలింగ్‌తో సెంట్రల్ జోన్ బ్యాటర్లను హడలెత్తించారు. ఇద్దరికి చెరో రెండు వికెట్లు లభించాయి.

సెంట్రల్ బ్యాటర్లలో ఓపెనర్ అక్షయ్ వాడ్కర్ అజేయంగా 19 పరుగులు సాధించాడు. శుభమ్ శర్మ (8), సారాంశ్ జైన్ (4), దానిష్ మలేవర్ (5), కెప్టెన్ పటిదార్ (13) పరుగులు చేసి ఔటయ్యారు. యశ్ రాథోడ్ 13(నాటౌట్) జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. సెంట్రల్ మొదటి ఇన్నింగ్స్‌లో 511 పరుగులు సాధించింది. మరోవైపు సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన సెంట్రల్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఛేదించాల్సి వచ్చింది. కాగా, సారాంశ్ జైన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం సాధించిన సెంట్రల్ బ్యాటర్ యశ్ రాథోడ్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.