హైకోర్టు మొట్టికాయలు వేసినా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు
గ్రూప్-1 ఉద్యోగానికి మంత్రులు, అధికారులు రూ.లక్షల్లో లంచం డిమాండ్
ఈ విషయం నిరుద్యోగ యువకులే చెబుతున్నారు
రాష్ట్ర యువతను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వానిది జాబ్ క్యాలెండర్ కాదు..జాబ్‌లెస్ క్యాలెండర్
కెసిఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిన సర్కార్
కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి
మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ తన్నీరు హరీశ్‌రావు
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : గ్రూప్ వన్ పరీక్షలో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో నిర్వహించిన జాబ్‌మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రూప్ వన్ ఉద్యోగం కోసం మంత్రులు, అధికారులు లక్షల రూపంలో లంచాలు అడిగారని స్వయంగా యువకులే బహిరంగంగా చెబుతున్నారని అన్నారు. ఇంత నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారా అని హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన బుద్ధి రావడం లేదన్నారు. ఇంత జరిగినా తప్పులను సరిదిద్దుకోకుండా ఇంకా అప్పీల్ కు వెళ్తామనడం సిగ్గుచేటు అని అన్నారు.
రాష్ట్రంలోని యువతను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని మండిపడ్డారు. మాజీ సిఎం కెసిఆర్ ఉద్యోగాల భర్తీ కోసం అన్ని పూర్తి చేసి పెడితే. రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చి తమ సర్కారే ఉద్యోగాలు ఇచ్చిందని తప్పుడు ప్రచారాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఆ ఉద్యోగాలు భర్తీ చేసింది కెసిఆర్ సర్కారేనని అన్నారు. రేవంత్ రెడ్డి ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సైతం 2 లక్షల ఉద్యోగాలపై మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతిపై ప్రియాంక గాంధీ మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. కాంగ్రెస్‌ది జాబ్ క్యాలెండర్ కాదని.. జాబ్‌లెస్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. సిద్దిపేటకు మంజూరైన వెటర్నటీ కళాశాలను రేవంత్ రెడ్డి కొడంగల్‌కు తరలించుకోవడం సిగ్గుచేటు అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వెయ్యి పడకల ఆసుపత్రిలో మిగులు చిన్న చిన్న పనులు సైతం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వివిధ కంపెనీల సహకారంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు.
ఇప్పటికే సిద్దిపేటలో ఐటి టవర్‌ను ఏర్పాటు చేసుకొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు. యువత ఉద్యోగం చిన్నదా.. పెద్దదా అని ఆలోచించకుండా కష్టపడి పనిచేయాలని హితవు పలికారు. ఇంటినుంచి ఒక అడుగు బయటికి వేస్తేనే ప్రపంచం విలువ తెలిసి వస్తుందన్నారు. ప్రైవేటు రంగంలో సైతం ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. జాబ్‌మేళాలో పాల్గొన్న యువకులు నెలలోపే తిరిగి రాకుండా నిరంతరం కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
Also Read: మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె:కెటిఆర్