రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం కింద చెరువుల్లో చేపపిల్లల టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 28 జిల్లాలకు శుక్రవారం టెండర్లు ఖరారు అయ్యాయి. నాలుగు జిల్లాల్లో టెండర్లు రాలేదు. హైదరాబాద్ జిల్లాలో చెరువులు లేకపోవడంతో టెండర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. టెండర్లు దాఖలు కాని జిల్లాలు కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిర్మల్ ఉన్నాయి. ఈ జిల్లాల విషయంలో అధికారులు తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. శుక్రవారం ఖరారైన 28 జిల్లాల టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున ఎంపికైన కాంట్రాక్టు ఏజెన్సీలను అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు. ఎంపికైన ఏజెన్సీ వద్ద ఉన్న చేపపిల్లల సామర్ధం, సరఫరా చేసేందుకు అనుసరించాల్సిన మార్గాలను అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిజేస్తారు.
4.25 లక్షల మందికి లబ్ది లక్షం
రాష్ట్రంలో ప్రస్తుతం 6,152 మత్య సహకార సొసైటీలు ఉండగా, ఆయా మత్య సహకార సొసైటీల్లో దాదాపు 4.25 లక్షల మంది గంగపుత్రులు, బెస్తలు, గూడ్ల, ముదిరాజ్‌లు, మత్యకార్మికులు సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల పరిధిలో దాదాపు 26వేలకు పైగా జలాశయాల్లో సుమారు 84 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసేందుకు వీలుగా ఈ ఏడాది చేపపిల్లల సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.122.22 కోట్లు కేటాయించింది. మత్యశాఖ అధికారులు జిల్లాల వారీగా ఆన్ లైన్ టెండర్లను పిలిచారు.
Also Read: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ
తొమ్మిదేళ్లుగా ఉచిత చేపపిల్లల పథకం
గత తొమ్మిది సంవత్సరాలుగా చెరువుల్లో ఉచిత చేప పిల్లల పథకం కొనసాగుతోంది. అయితే గత రెండేళ్లుగా చేపపిల్లలు సరఫరాలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపధ్యంలో చేపపిల్లలను సరఫరా చేసిన ఏజెన్సీలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు నిలిపివేసింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. చేప పిల్లలు సరఫరా చేసిన కొందరు కాంట్రాక్టర్లు హైకోర్టు నుంచి ఆదేశాలు తీసుకురావడంతో వారికి బిల్లులు ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి గత ప్రభుత్వంలో చేపపిల్లల కొనుగోలు ప్రక్రియకు అనుసరించిన విధానాలు, చేప పిల్లల సైజు వివరాలు, సరఫరా చేసిన చేప పిల్లల సంఖ్యా వివరాలకు పొంతన లేకపోవడంతో అక్రమాలు చోటుచేసుకున్నాయని కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది.