ఓటు చోరీ నినాదంతో ప్రజల్లోకి.. రాహుల్ గాంధీ వెల్లడి

రాయ్‌బరేలీ: దేశ ప్రజల ముందుకు కాంగ్రెస్ పార్టీ.. ఓటు చోర్, గద్ది చోడ్ నినాదంతో మరింత బలంగా వెళ్లుతుందని పార్టీ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజల నిజమైన ప్రజాస్వామిక ఓటు హక్కు చోరీ అయిందని, దేశవ్యాప్తంగా ఇది జరిగిందని చెప్పారు. ఇదే విషయాన్ని తమ పార్టీ రాబోయే రోజులలో మరింత ఆశ్చర్యకర నాటకీయ ఉదాహరణలతో ప్రజల ముందుంచుతుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని తమ సొంత పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో రెండు రోజుల పర్యటనకు రాహుల్ బుధవారం వచ్చారు.

లక్నోలోని చౌదరి చరణ్‌సింగ్ విమానాశ్రయం వెలుపల ఆయనకు పిసిసి అధ్యక్షులు అజయ్ రాయ్ ఇతర సీనియర్ నాయకులు స్వాగతం పలికారు. అధికారం నిలబెట్టుకునేందుకు బిజెపి ఓట్ల చోరీకి పాల్పడింది. ఇది అంతటా జరిగింది. దీనిని తాము ప్రజల ముందు నిరూపించి తీరుతామని విలేకరుల సమావేశంలో చెప్పారు. రాయ్‌బరేలీలో పలు అభివృద్ధి పనుల సమీక్షలు, శంకుస్థాపనలు ఇతర కార్యక్రమాలలో రాహుల్ రెండు రోజుల పాటు పాల్గొంటారు.